రెవెన్యూ లీలలు! | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ లీలలు!

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

అక్రమాలకు నిలయంగా తహసీల్‌ కార్యాలయం

అల్లాదుర్గం(మెదక్‌): రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. రూ.లక్షల జీతాలు తీసుకుంటూ లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు నిరుపేదల రక్తం తాగుతున్నారు. మాముళ్లు ఇస్తే క్షణాల్లో పట్టా చేస్తున్నారు.. ఇవ్వకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, విచారణ చేయడం లేదు. ఆర్డీఓను వివరణ అడిగితే సమాధానం దాటవేత వేస్తున్నారు. ఇది అల్లాదుర్గం తహసీల్దార్‌ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తంతు..

● అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లికి చెందిన తలారి శంకరయ్య తన అన్న కొడుకు మొగులయ్యకు 5 గుంటల భూమిని దాన పత్రం కింద ఇచ్చేందుకు స్లాట్‌ బుక్‌ చేశాడు. మంగళవారం రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళితే అన్న కొడుకు కాబట్టి దానపత్రం కింద రిజిస్ట్రేషన్‌ చేయడం చెల్లదని తహసీల్దార్‌ తిప్పి పంపారు.

● ఇటీవల ఓ మహిళ తన అల్లుడికి సేల్‌డీడ్‌ కింద స్లాట్‌ బుక్‌ చేసి రిజిస్ట్రేషన్‌కు వెళితే దానపత్రం కింద చేసుకోవాలని చెప్పి పంపారు. అలాగే తండ్రి కూతురికి సేల్‌డీడ్‌ కింద రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేస్తే చెల్లదని చెబుతున్నారు. ఇలా ఎన్నో సాకులు చెబుతూ తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుండా తిప్పి పంపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఇదే కార్యాలయంలో బతికున్న వ్యక్తి మృతిచెందినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్‌ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల వారిని సముదాయించి రాజీ చేసి తిరిగి బతికున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ చేశారు. తప్పుడు రికార్డులు సృష్టించి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

● గడిపెద్దాపూర్‌లో మహిళ మృతి చెందితే కొడుకులు ఉన్నా, సాదాబైనామాపై ఎవరూ లేకున్నా.. మరొకరి పేరుపై క్షణాల్లో రిజిస్ట్రేషన్‌ చేశారు. – ఈ సంఘటనలపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆర్డీఓ స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతో చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.

● ఈ విషయంపై తహసీల్దార్‌ మల్లయ్యను వివరణ కోరగా బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశం ఉండటంతో రిజిస్ట్రేషన్‌ చేయలేదని చెప్పడం గమనార్హం.

మూముళ్లు ఇస్తే క్షణాల్లో పట్టా.. లేకుంటే అడ్డంకులు

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement