డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
నర్సాపూర్ రూరల్: నీట్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ప్రారంభించిన ‘ఛాత్రోన్ కి గూంజ్’ ఉద్యమానికి మద్దతుగా బుధవారం నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, తరచూ లీక్ అవుతున్న ప్రశ్నాపత్నాలు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జాప్యం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయలేని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్, నాయకులు విజయ్ కుమార్, అశోక్‌గౌడ్, సుధీర్ కుమార్, పాషా, అజ్మత్, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నా యకులు పాల్గొన్నారు.
సమాచారం లేకుండానే ర్యాలీ
కిందిస్థాయి నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించడంపై కొంత మంది కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ ప్రారంభించిన ఉద్యమానికి మద్దతుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు నిలబడతాడన్న సంగతి మరిచి ఒంటెద్దు పోకడతో తు తూ మంత్రంగా ర్యాలీ నిర్వహించడం సరికాదన్నారు.


