ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
మెదక్‌జోన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ బారినపడిన వారిని బాధితులుగానే చూస్తున్నామని, పునరావాస కేంద్రాల ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకువస్తామన్నారు. అలాంటి వారిని క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రథమ విజేతగా నిలిచిన రాయల్ వారియర్స్ జట్టుకు రూ.5,000 నగదు, ద్వితీయ విజేతగా రాయల్ ఆవుసులపల్లి జట్టుకు రూ.2,500 నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, డ్రగ్స్ విక్రయం, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అంతకుముందు యువతతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ సీఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


