న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
చినుకు రాలదు..
చింత వీడదు
మెదక్ అర్బన్: వానాకాలం సాగు.. రైతన్న మెడ మీద కత్తిలా మారింది. కార్తెలు గడుస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. పొలాలు బీళ్లులా మారాయి. వరి నారు మళ్లు తడారుతున్నాయి. రైతన్న కళ్లు చెమ్మబారుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 36 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మెతుకు సీమ పంటలకు ప్రాణం పోసే.. ఘనపురం ప్రాజెక్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావం ఒక వైపు..ఆకాశన్నంటిన ఎరువుల ధరలు మరోవైపు అన్నదాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈయేడు ఖరీఫ్‌లో 3,67.668 ఎకరాలు సాగవుతుంది అనుకుంటే.. ప్రతికూల పరిస్థితుల్లో అది ఎంత వరకు సాధ్యమవుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మండుతున్న ఎండలు..
రోహిణి.. మృగసిర కార్తెలు కదిలి పోయినా చినుకు జాడ లేదు. మరో వైపు ఎండలు మండుతున్నాయి.జిల్లాలో సగటున 81 మి.మీ వర్ష పాతం కురువాల్సి ఉండగా, ఇప్పటి వరకు 51.7 మి.మీ. మాత్రమే నమోదు అయ్యింది. వాతావరణ నివేదిక ప్రకారం సుమారు 36 మి.మీ లోటు ఉంది.అత్యధికంగా నార్సింగి మండలంలో జూన్ నెలలో 80.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 20.4 మి.మీ మాత్రమే నమోదయ్యింది.ఇలా జిల్లాలో ఎక్కడా కూడ ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు.ఖరీఫ్ పై ఆశతో జిల్లాలో ఇప్పటికే రైతులు ,రోహిణి కార్తెలో వరి తుకాలు పోశారు.అయితే వర్షాలు పడక పోవడంతో ,వరి మొక్కలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. బోర్లు ఉన్న రైతులు మాత్రం ఎలాగోలా తుకాలు కాపాడుకుంటున్నారు. ఇక మెతుకు సీమ పంటలకు ప్రాణం పోసే ఘనపురం ప్రాజెక్టు కింద, సింగూరు మరమ్మతుల నేపథ్యంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో సుమారు 30 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఆకాశాన్నింటిన ఎరువుల ధరలు
‘గోటి చుట్టు మీద రోకటి పోటులా’ ఒక వైపు వర్షాభావం మరో వైపు ఎరువుల ధరా భారం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూన్ నెల మొదటి వారం నుంచి 15 రోజుల్లో ఎరువుల ధరలు రెండు సార్లు పెరిగాయి. ఒక్కో సంచిపై రూ.650 వరకు పెరగడం.. ఫర్టిలైజర్ డీలర్లు పాత ఎరువులనే, కొత్త ధరలకు అమ్ముతున్నా..గత్యంతరం లేక రైతులు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు.
వానాకాలం సాగు.. ప్రశ్నార్థకం
జిల్లాలో 36 శాతం లోటు వర్షపాతం
ఇటు క్రాప్ హాలిడే.. అటు ఎల్‌నినో
జిల్లాలో 3,67,668 ఎకరాల
సాగు అంచనా


