వైభవంగా ఎల్లమ్మకు బోనాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఎల్లమ్మకు బోనాలు

Jun 24 2026 9:10 AM | Updated on Jun 24 2026 9:10 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం గ్రామ పురవీధులగుండా రేణుకా ఎల్లమ్మకు మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తరలివెళ్లి బోనాలను సమర్పించారు. యువకుల నృత్యాలు, భాజాభజంత్రీల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

డ్రగ్స్‌ రహిత

సమాజమే ధ్యేయం : ఎస్పీ

మెదక్‌జోన్‌: డ్రగ్స్‌రహిత సమాజమే ధ్యేయంగా యువత ముందుకు సాగాలని ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ నిర్మూలకు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో వన్‌–డే క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు యువత జీవితాలు, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు బానిసైతే ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయన్నారు. డ్రగ్స్‌కు నో చెప్పి, క్రీడలకు ఎస్‌ చెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌సింగ్‌, డీఎస్పీ ప్రసన్న కుమార్‌, మెదక్‌ టౌన్‌ సీఐ మహేశ్‌, వివిధ కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

విత్తన మేళాతో మేలు

జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌

తూప్రాన్‌: ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్‌ సూచించారు. మంగళవారం పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వం అందిస్తున్న ఏడు రకాల విత్తనాలను సాగు చేసి క్వింటాళ్లకు రూ.500 బోనాస్‌ను పొందాలని సూచించారు. కన్జూమర్‌ ఫోరం అధ్యక్షురాలు గాయత్రి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, నర్సాపూర్‌ సహాయ వ్యవసాయ సంచాలకురాలు సంధ్యారాణి, టెక్నికల్‌ వ్యవసాయ అధికారి యాదగిరి, మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

రీసర్వేకు సహకరించండి

జిల్లా భూసర్వే రికార్డుల అధికారి కిషన్‌

నర్సాపూర్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీసర్వే కోసం భూ యజమానులు సహకరించాలని జిల్లా భూసర్వే రికార్డుల అధికారి కిషన్‌ కోరారు. మంగళవారం మండలంలోని అద్మాపూర్‌లో ’భూభారతి’ కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేపై తహసీల్దార్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌ మాట్లాడారు. రీసర్వే ద్వారా భూముల హద్దులతో పాటు ప్రతి ఒక్కరి భూమి విస్తీర్ణం స్పష్టంగా నమోదవుతుందని, దీనివల్ల గట్ల పంచాయతీలు లేకుండా పటిష్టమైన రికార్డులు తయారవుతాయని చెప్పారు. నర్సాపూర్‌ మండలంలోని నియమతల్లిగూడ, ఎల్లాపూర్‌ గ్రామాల్లో ఇప్పటికే ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామసభలో డివిజనల్‌ సర్వే అధికారి రామ్‌రెడ్డి, మండల సర్వే అధికారి అభిలాష్‌, ఆర్‌ఐ సిద్దిరాం రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement