చేగుంట(తూప్రాన్): పాఠశాలల్లో ఒక గంట పాటు క్రీడల్లో శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా చేగుంటలో ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని డీఈఓ రాజు, సర్పంచ్ స్రవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు పోటీతత్వం అలవడుతుందని, అందుకోసం పాఠశాలల్లో క్రీడల పట్ల విద్యార్థులకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు నాగరాజు, యోగాకోచ్ గణేశ్‌రవికుమార్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, పీడీలు శారద, శంకర్, పీఈటీలు నరేశ్, గిరిజ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు లక్ష్మణ్, మనోహర్‌రావు, వెంకటేశ్, విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని డీఈఓ రాజు అన్నారు. మంగళవారం మండలంలోని శేరీల ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. చిన్నారులకు ప్రీప్రైమరీ విద్య ఎంతో కీలకమన్నారు. చిన్న వయస్సులోనే విద్యపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించడాన్ని తల్లిదండ్రులు స్వాగతించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. అనంతరం ఎంఈఓ బుచ్చనాయక్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం మండలంలో నాలుగు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక సెక్షన్ మంజూరయిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎం సాంబయ్య, పాఠశాల హెచ్‌ఎం ప్రణీద్‌కుమార్, ఏఏపీసీ చైర్మన్ రేణుక తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి రాజు


