రామాయంపేట(మెదక్): నగల కోసం సొంత అమ్మమ్మను హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక సీఐ సైదా కేసు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన దోమకొండ సాయవ్వ(63)కు కుమారునితోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. కుమారుడు తన భార్యాపిల్లలతో కలిసి వేరే ఇంట్లో ఉంటుండగా, సాయవ్వ ఒక్కరే తన పాత ఇంట్లో ఉంటోంది. ఈనెల 17న రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సైతం కనిపించలేదు. దీనికి తోడు ఆమె మెడపై కమిలిపోయిన గుర్తులు ఉండటంతో అంత్యక్రియల అనంతరం ఈనెల 21న ఆమె కుమారుడు శ్యామ్, తన తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను విచారించగా, హత్యోదంతం వెలుగుచూసింది. మృతురాలి చిన్న కూతురు లక్ష్మి కుమారుడు మొగిలి విశాల్(21), అతని స్నేహితుడు బీరగొండ ప్రశాంత్ (21)తో కలిసి 17న రాత్రి 11 గంటలకు పథకం ప్రకారం తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. కల్లులో మత్తుమాత్రలు కలిపి ఆమెకు తాగించగా, ఆమె స్ఫృహ తప్పింది. అనంతరం ప్రశాంత్ సాయవ్వ కాళ్లు పట్టుకోగా, మనవడు విశాల్ ఆమె గొంతు నులిమి హతమార్చాడు. చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న ఇద్దరూ ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం, చెవి కమ్మలు, రూ. 7వేల నగదు తీసుకొని పారిపోయారు. ఈనెల 22న నిందితులిద్దరిని రామాయంపేటలో పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
మనవడు, అతడి స్నేహితుడి అరెస్టు
కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు


