చేపలు పట్టేందుకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టేందుకు వెళ్లి..

Jun 24 2026 9:10 AM | Updated on Jun 24 2026 9:10 AM

నాచగిరిలో ఇక రోజంతా దర్శనాలు

చెరువులో మునిగి వ్యక్తి మృతి

శివ్వంపేట(నర్సాపూర్‌): చేపలు పట్టేందుకు చెరువులోకి దిగిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం... బిక్యా పంచాయతీ తుక్యాతండాకు చెందిన కోల విఠల్‌(38) సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు స్థానిక పెద్దచెరువు వద్దకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం చెరువు వద్ద వెతుకుతుండగా మృతదేహం కనిపించింది. చేపలు పడుతుండగా వల కాళ్లకు చుట్టుకొని నీటమునిగి మృతిచెందాడని తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రేపటి నుంచి అమలు

వర్గల్‌(గజ్వేల్‌): విశేషమైన భక్తజనాదరణ కలిగిన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఆలయ వేళలు మారుతున్నాయి. భక్తులకు నిరీక్షణ లేకుండా ఇక రోజంతా శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. అదేవిధంగా పూజాకార్యక్రమ వేళలోనూ మార్పులు చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయం ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు తెరిచిఉంటుంది. శని, ఆదివారాల్లో ఎలాంటి విరామం లేకుండా ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. పూజా కార్యక్రమాల్లోనూ మార్పు చేశారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం గురువారం నుంచి నూతన వేళలు అమలులోకి వస్తాయని ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement