అన్నదాతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు భరోసా

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

వానాకాలం సాగు పనులు ఊపందుకునే వేళ రైతాంగానికి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఈనెల 30న ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. విత్తనాలు వేసే సమయానికి పెట్టుబడి సాయం అందనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో ఎన్ని ఎకరాల వరకు అందజేస్తారనేది తెలియాల్సి ఉంది.

– మెదక్‌జోన్‌

జిల్లాలో 4 లక్షల పైచిలుకు వ్యవసాయ భూములుండగా, ఈ వానాకాలంలో 3.95 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. యాసంగి కొనుగోళ్లు చివరి దశకు చేరుకోగా, ఖరీఫ్‌ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈక్రమంలో ఈనెల 30న రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో లాగా నిధుల జమ నెలల తరబడి సాగ దీయకుండా, కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఎకరానికి రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు చేరేలా ప్రణాళికను రూపొందించింది. దీని వల్ల సకాలంలో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది వానాకాలం సీజన్‌లో 3,68,072 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయగా, సుమారు రూ. 220 కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు.

యాసంగిలో రెండెకరాలకే..

యాసంగి సీజన్‌లో జిల్లాలో 3,05,273 ఎకరాల్లో 2.67 లక్షల పైచిలుకు మంది రైతులు పంటలు పండించారు. మొత్తం 3.68 వేల ఎకరాలకు రూ. 220 కోట్ల మేర రైతు భరోసా నిధులు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రెండు విడతల్లో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు రూ.166 కోట్లను పెట్టుబడి సాయంగా అందించింది. ఈ లెక్కన ఇంకా రూ. 54 కోట్లు రెండెకరాలకు పైగా ఉన్నా రైతులకు సాయం అందలేదు. ఈ సీజన్‌లోనైనా పూర్తిస్థాయిలో అందజేస్తారా..? లేక యాసంగి లాగే కొంత మందికే ఇస్తారా అని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

30న ఖరీఫ్‌ పెట్టుబడి సాయం

సీఎం ప్రకటనతో రైతుల్లో ఆశలు

మొదలైన సాగు పనులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement