అటవీ జాగా.. వేసెయ్‌ పాగా! | - | Sakshi
Sakshi News home page

అటవీ జాగా.. వేసెయ్‌ పాగా!

Jun 21 2026 7:16 AM | Updated on Jun 21 2026 7:16 AM

అటవీ భూముల ఆక్రమణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జిల్లాలో ఇప్పటివరకు 5,599 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురికాగా, తాజాగా మరో 6 చోట్ల ఆక్రమించారు. పుష్కరకాలంగా ఆక్రమణదారులపై 316 కేసులు నమోదు అయినట్లు అటవీశాఖ రికార్డులుచెబుతున్నాయి. ఖద్దర్‌ నేతల అండతేనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతకాలంగా 5,599 ఎకరాల అటవీ భూములను కబ్జాకోరులు ఆక్రమించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అంతకన్నా ఎక్కువే ఉన్నట్లు సమాచారం. వానాకాలం వచ్చిందంటే చాలు అడవుల్లోని చెట్లను విచక్షణ రహితంగా నరికేసి భూమి చదును చేసి ఆక్రమిస్తున్నారు. తాజాగా రెండు నెలల్లో మరో 6 చోట్ల సుమారు 20 ఎకరాలకు పైగా ఆక్రమించారు. గడిచిన 12 ఏళ్లలో ఇప్పటివరకు 316 కేసులు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఖద్దర్‌ నేతల అండతోనే..

అడవులను ఆక్రమించే కబ్జా కోరులకు ఖద్దర్‌ నేతల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తే అధికార పార్టీకి చెందిన నేతలు అధికారులకు ఫోన్లు చేసి ఎలాంటి కేసులు నమోదు చేయవద్దంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంత కాలానికి అడవులు పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న భూమికి 33 శాతం మేర ఉండాల్సిన అడవులు, ప్రస్తుతం 21 శాతానికే పరిమితం అయ్యాయి. ఉండాల్సిన దాని కంటే 12 శాతం తక్కువగా ఉండటంతో వాతావరణం అనేక మార్పులు చోటు చేసుకొని పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.

వేధిస్తున్న సిబ్బంది కొరత

జిల్లాలో 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా, మెదక్‌, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, తూప్రాన్‌, రామాయంపేట, నర్సాపూర్‌ రేంజ్‌లుగా విభజించారు. కాగా నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో 112 మంది బీట్‌ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అంటే 60 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి. ఒక్కో బీట్‌ ఆఫీసర్‌కు 2 నుంచి 3 బీట్లు అప్పగించడంతో అడవుల సంరక్షణపై పర్యవేక్షణ కరువైంది.

జిల్లాలో ఇప్పటివరకు 5,599 ఎకరాల కబ్జా

తాజాగా మరో ఆరు చోట్ల ఆక్రమణ

పుష్కరకాలంగా 316 కేసుల నమోదు

పర్యావరణానికి ముప్పు

అడవుల జోలికొస్తే చర్యలు

ఫారెస్ట్‌ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. ముఖ్య ంగా అడవులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కబ్జాలు జరుగుతున్నాయి. తాజాగా ఆరు చోట్ల కబ్జా చేస్తే కేసులు నమోదు చేశాం.

– జోజి, డీఎఫ్‌ఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement