అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగే నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోని అనుమతి ఉంటుంది. అనంతరం అనుమతించరు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఎన్‌టీఏ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కోసం ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. అలాగే రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇన్విజిలేటర్ సమక్షంలో ఓఎంఆర్ షీట్, హాజరు పట్టికపై సంతకాలు చేయాలి. పరీక్షా కేంద్రంలో ఎన్‌టీఏ అందించే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. సొంతంగా పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు తీసుకురావద్దు. పరీక్ష కేంద్రంలోనే ఇస్తారు. ఓఎంఆర్ షీట్‌పై అనవసర గుర్తులు చేయవద్దు. బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ లేదా కమ్యూనికేషన్ పరికరాలను తీసుకురావద్దు. పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి: ఎస్పీ
మెదక్‌జోన్: నీట్ యూజీ పరీక్షకు అందరూ సహకరించి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు కొనసాగే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తామని చెప్పారు.


