రామాయంపేట(మెదక్): జొన్నల కొనుగోలు విషయమై అధికారులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కారు. నిబంధనల పేరిట లారీలను గత ఐదు రోజులుగా ఖాళీ చేయించడం లేదని ఆరోపించారు. ఈమేరకు స్థానిక అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు పట్టణంలోని మెదక్ రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం నుంచి మూడు లారీల్లో జొన్నలు గజ్వేల్, దౌల్తాబాద్ గోదాంలకు తరలించగా, నాణ్యతగా లేవనే సాకుతో అక్కడి గోదాం అధికారులు లారీలను ఖాళీ చేయించడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయమై రైతులకు న్యాయం చేస్తానని డీఏఓ హామీ ఇచ్చారు. రైతుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ బాల్‌రాజు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.


