యాసంగిలో రైతుల పంట పండింది
● ఎకరాకు 37 క్వింటాళ్ల పైనే దిగుబడి
● రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
● ఇప్పటివరకు
4.13 లక్షల ఎంటీల కొనుగోలు
యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. ఆశించిన దానికంటే అధికంగా దిగుబడి వచ్చింది. అదే సమయంలో జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 4.13 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించింది. మరో 2 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 3,05,723 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 50,555 ఎకరాల్లో సన్నాలు, 2,55,168 ఎకరాల్లో దొడ్డు రకం పంటలు పండించారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి దొడ్డు రకం వరి ఎకరాకు 37 క్వింటాళ్లకు పైగా దిగుబడి రాగా, సన్నాలు సైతం 25 క్వింటాళ్లకు పైగా వచ్చింది. అదే సమయంలో ధాన్యం సేకరణ సైతం గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల లోపే ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేసి, 533 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికే 4.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మరో 2 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన అధికారుల అంచనాకు మించి సుమారు 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వచ్చింది.
సాగు తగ్గినా.. పెరిగిన దిగుబడి
గతేడాది వానాకాలంతో పోలిస్తే ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ దిగుబడి మాత్రం పెరిగింది. వానాకాలంలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.77 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. యాసంగిలో 3.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే ఇప్పటివరకు 4.13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. అంటే వానాకాలం కన్నా యాసంగిలో 10 వేల ఎకరాల సాగు తగ్గినా, 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అధికంగా వడ్లు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు.
సంవత్సరం వానాకాలం యాసంగి
2023 3,93,615 3,25,570
2024 3,28,718 2,84,849
2025 2,92,263 3,19,144
2026 3,77,914 4,13,237
జిల్లాలో ధాన్యం సేకరణ ఇలా..
పంట బాగా వచ్చింది
యాసంగిలో నాకున్న మూడున్నర ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశా. ఇటీవల కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయగా 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు 37 క్వింటాళ్లకు పైగానే వచ్చింది. ఈసారి నూటికి 90 శాతం మంది రైతులకు పంట దిగుబడి బాగా వచ్చింది. – ఆంజనేయులు,
చందాపూర్, చిన్నశంకరంపేట


