సహకారం.. ఇక వినూత్నం | - | Sakshi
Sakshi News home page

సహకారం.. ఇక వినూత్నం

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

సరికొత్త బాటలో పీఏసీఎస్‌లు

నాణ్యమైన విత్తన ఉత్పత్తి, అమ్మకాలే లక్ష్యం

ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం

సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్‌) ఇక సరికొత్త బాటలో పయనించనున్నాయి. సభ్యులకు రుణాలివ్వడం, వాటిని రాబట్టడం, కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, ఫర్టిలైజర్‌, బయట నుంచి తెచ్చిన విత్తనాలు అమ్మడం మాత్రమే ఇప్పటివరకు చేశాయి. ఇక పీఏసీఎస్‌ పరిధిలో సభ్యులచే విత్తనాభివృద్ధి చేయించి వారి బ్రాండ్‌ మీదనే నాణ్యమైన వరి విత్తనాలు విక్రయించనున్నారు. ఈ మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా నాబార్డు సహకారంతో సీడ్‌ ప్రొడక్షన్‌కు నడుం బిగించింది.

7 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు

ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా దాదాపు 7 లక్షలకు పైగా ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కావాల్సినంత సీడ్‌ ఉత్పత్తి లేకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సన్న వడ్లు సాగు చేయాలని రైతులకు సూచిస్తుండటంతో.. విత్తనాల కోసం ఇబ్బందులు తప్పేలా లేదు. అలాగే నాణ్యత లేని విత్తనాలతో దిగుబడి తక్కువగా రావడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సర్టిఫైడ్‌ చేసిన విత్తనాలు కాకుండా ఎక్కువ ప్రైవేట్‌ కంపెనీలు ట్రూత్‌ఫుల్‌ లెబుల్‌ సీడ్‌(టీ/ఎల్‌) వరి విత్తనాలు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి తక్కువ రావడం ఇతరత్రా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామాలే సీడ్‌ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించింది.

8 పీఏసీఎస్‌లలో విత్తనాభివృద్ధి

పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాకు మూడు చొప్పున రాష్ట్రంలో 93 పీఏసీఎస్‌లలో సీడ్‌ ఉత్పత్తిని ఈ ఖరీఫ్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 8 పీఏసీఎస్‌లుండగా అందులో సిద్దిపేట–3, మెదక్‌–3, సంగారెడ్డి–2 పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. ఒక్కో పీఏఏసీఎస్‌ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు సీడ్‌ ఉత్పత్తి్‌ చేయనున్నారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పలు సొసైటీలకు సీడ్‌ ప్రొడక్షన్‌న్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

సొంత బ్రాండ్‌తో..

సీడ్‌ ఉత్పత్తి అయిన తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్‌ కొనుగోలు చేస్తుంది. వాటిని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సర్టిఫైడ్‌ చేయించనున్నారు. బ్యాడ్జ్‌ నంబర్‌తో కూడిన ట్యాగ్‌లైన్‌ పొందనున్నారు. సొంత బ్రాండ్‌తో ఆ పీఏసీఎస్‌ పరిధిలోని రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించనున్నారు. ఇలా చేయడం ద్వారా సోసైటీకి లాభంతో పాటు నాణ్యమైన విత్తనాలు అంది పంట దిగుబడి పెరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement