కాంగ్రెస్‌ హయాంలో రైతులకు తిప్పలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హయాంలో రైతులకు తిప్పలు

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

కాంగ్రెస్‌ హయాంలో రైతులకు తిప్పలు ఉన్నత ప్రమాణాలతో విద్య విద్యార్థులు శ్రద్ధగా చదవాలి గెస్ట్‌ టీచర్‌ కు ఆహ్వానం

వెల్దుర్తి(తూప్రాన్‌): ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని మెల్లూరులో పర్యటించారు. రూ. 10 లక్షలతో నిర్మించిన స్కూల్‌ ప్రహరీని ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించి స్వయంగా విద్యార్థులకు వడ్డించారు. అనంతరం పిట్టలవాడలో సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే బస్వాపూర్‌లో ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేస్తామని మాట మార్చిందన్నారు. కనీసం రైతుబీమా ప్రీమియం కట్టలేని స్థితిలో ఉండడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రంగారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.

కొల్చారం(నర్సాపూర్‌): విద్యార్థులు క్రమశిక్షణతో చదవడం ద్వారా ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డీఈఓ రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా విద్యాప్రగతి, మౌలిక వసతులు, బోధన, అభ్యాస కార్యక్రమాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశా రు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉమారాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు ఇష్టంతో శ్రద్ధగా చదవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లేది విద్య మాత్రమే చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లలితాదేవి, ఉపసర్పంచ్‌ శ్వేత, ఆప్‌ చైర్మన్‌ రాధిక, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్‌ జగన్‌, ఉపాధ్యాయులు నరేందర్‌, శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

వెల్దుర్తి(తూప్రాన్‌): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో హిందీ గెస్ట్‌ టీచర్‌ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఓ ఫాతిమా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఈడీతో పాటు బోధనలో అనుభవం కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా హిందీలో సమర్థవంతంగా మాట్లాడడం, రాయడం, చదవడం రావాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీ లోపు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement