ఎంపీడీఓ ఆనంద్
హవేళిఘణాపూర్(మెదక్): ప్రజలు తమ ఇంటి ముందుకు వచ్చిన ట్రాక్టర్‌కు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ఎండీపీఓ ఆనంద్ సూచించారు. గురువారం హవేళిఘణాపూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చే పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్, పంచాయతీ సెక్రటరీ రమేశ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు
ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ పరమేశ్వరి
మెదక్ కలెక్టరేట్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు డిపో అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ పరమేశ్వరి తెలిపారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపోమేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ పని చేసిన డిపో మేనేజర్ సురేఖ హైదరాబాద్‌లోని ఫలక్‌నూమా డిపోకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి పరమేశ్వరీ వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. డిపో అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.
జోగ్యకుంట కబ్జా
తూప్రాన్: మట్టితో కుంటను పూడ్చివేసి కబ్జా చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని నర్సంపల్లి గ్రామస్తులు ఇరిగేషన్ డీఈఈ కరుణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం కుంటను ఆమె పరిశీలించారు. గ్రామ సమీపంలోని సర్వే నంబరు 249లోని జోగ్య కుంటను గ్రామానికి చెందిన పొలం యాజమాని రఘుపాల్‌రెడ్డి, కౌలుదారు ధరావత్ శ్రీను అనే ఇద్దరు జేసీబీతో పూడ్చివేశారు. గమనించిన సర్పంచ్ ధరావత్ భాస్కర్, గ్రామస్తులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఇరిగేషన్ డీఈఈ కరుణ విచారణ చేపట్టారు. కుంట కబ్జాకు కారకులైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్‌తోనే
సొంతింటి కల సాకారం
వెల్దుర్తి(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రాజిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని భస్వా పూర్, మెల్లూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, మెల్లూర్‌లో సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
నేటి నుంచి ఉత్సవాలు
నర్సాపూర్: నర్సాపూర్‌లోని రేణుకఎల్లమ్మ మాత ఆలయాన్ని 15వ వార్షికోత్సవాలకు సిద్ధం చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉద యం గణపతిపూజ, పుణ్యావాచనం, రేణుక ఎల్లమ్మదేవి జమదగ్ని స్వామి కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలు ఆలయ పూజారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో చేశారు. 20న చండీ హవనం, సామూహిక కుంకుమార్చన, పూర్ణాహుతి తదితర పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మైనర్లు డ్రైవింగ్ చేస్తే జరిమానా
నర్సాపూర్ రూరల్: మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.2వేలు జరిమానా విధిస్తామని మండలంలోని చిన్నచింతకుంట గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామసభలో తీర్మానించారు. గురువారం చిన్న చింతకుంట గ్రామ సభ ప్యాట సరిత అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు అభివృద్ధిపై పలు తీర్మానాలు చేయడంతో పాటు చర్చించుకున్నారు. మైనర్ బాల బాలికలను పనిలో పెట్టకుండా చదివించేలా చూసుకోవాలన్నారు.


