చిలప్‌చెడ్(నర్సాపూర్): తరతరాలుగా శ్మశాన వాటికగా వాడుకుంటున్న భూమిని కొందరు వ్యక్తులు తమదంటూ కబ్జాకు యత్నిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమక్కపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని రహీంగూడ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటికగా ఉన్న స్థలంపై ప్రస్తుతం వివాదం నెలకొంది. గతంలో గ్రామానికి చెందిన గోపాల్‌రావు అనే వ్యక్తి సర్వే నంబర్ 8లో చెరువుకు ఆనుకుని ఉన్న తన భూమిని శ్మశాన వాటిక కోసం గ్రామస్తులకు దానమిచ్చాడు. ఆ తర్వాత అతని కుటుంబం రహీంగూడను వదిలి శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.
బోరుబావి తవ్వకంతో మొదలైన వివాదం
ప్రస్తుతం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో తాగునీటి కోసం శ్మశాన స్థలంలో బోరు వేయించారు. దీంతో అసలు వివాదం తెరపైకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆ భూమి తమదేనంటూ అడ్డుపడింది. 20 ఏళ్లుగా ఆ భూమి తమ ఆధీనంలో ఉందని, దానికి సంబంధించిన పట్టా దార్ పాస్‌బుక్కు కూడా తమ వద్దే ఉందని వారు వాదిస్తున్నారు.
అక్రమంగా పట్టా చేయించుకున్నారు..
ఈ వ్యవహారంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానమిచ్చిన గోపాల్‌రావు కుమారుడైన లక్ష్మణ్‌రావు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు వ్యక్తులు అన్యాయంగా ఆ బొందలగడ్డను పట్టా భూమిగా మార్పించుకున్నారని ఆరోపించారు. రికార్డుల్లో ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ భూమి ఎప్పుడూ వారి ఆధీనంలో లేదని, దశాబ్దాలుగా అక్కడ సమాధులు ఉన్నాయని స్పష్టం చేశారు.
విచారణ జరుపుతాం
గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఈ భూవివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. రికార్డులను పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
– తహసీల్దార్
రెవెన్యూ, పోలీస్‌స్టేషన్‌ల్లో ఫిర్యాదులు
దానమిచ్చిన స్థలంపై కొందరి కన్ను..
ఆరు కిలోమీటర్ల పాదయాత్రతో నిరసన


