హవేళిఘణాపూర్(మెదక్): అటవీ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేసి సాగు భూములుగా మారుస్తున్నా, అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాజ్‌పేటతో పాటు అటవీ ప్రాంతాలు ఉన్న గ్రామాల పరిసరాల్లో ఈ భూఆక్రమణలు సర్వసాధారణంగా మారాయి. కబ్జాదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో, వారు యథేచ్ఛగా అటవీ భూములను చదును చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమై సాగు సమయం వచ్చిందంటే చాలు... అటవీ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు పక్కనే ఉన్న అటవీ భూమిని ఆక్రమించడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా గాజిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో సుమారు ఒక ఎకరం వరకు అటవీ భూమిని సాగు భూమిగా మార్చేందుకు దుండగులు చదును చేశారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అటవీ భూముల కబ్జాకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
● సాగు భూములుగా మారుస్తున్న వైనం
● అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం


