కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. నేడు పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా కొత్త ఉత్సాహంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగు పెట్టాలన్నారు. క్రమశిక్షణతో చదువుకొని ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ విద్యా సంవత్సరం విజయంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ప్రాణదాతకు ప్రశంసలు
రామాయంపేట(మెదక్): ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి ఆది వారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రక్తదానం చేశారు. ఈసందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్షా శిబిరాన్ని సందర్శించి రాజశేఖర్‌రెడ్డిని ప్రశంసించి సన్మానించారు.
రెండోసారి పెరిగిన
ఎరువుల ధరలు
పాపన్నపేట(మెదక్): పది రోజుల్లో ఎరువుల ధరలు రెండు సార్లు పెరగడంతో అన్నదాతల ఆందోళన చెందుతున్నారు. చేతిలో పైసలు లేక, అడ్వాన్స్‌గా ఎరువులు కొనలేక ఆగమవుతున్నారు. ఈనెల 4న ఒక్కో సంచిపై సుమారు రూ.200 నుంచి రూ.400 వరకు పెరిగాయి. పది రోజులు కాక ముందే ఈనెల 13న మరోసారి ధరలు పెరిగాయి. ఇక ఫర్టిలైజర్ షాపు యజమానులు, అధీకృత డీలర్లు పాత ఎమ్మార్పీ సంచులను కొత్త ధరలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఖరీఫ్‌కు సంబంధించి 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ తెలిపారు. కాగా, డీఏపీ, యూరియా ఎరువుల ధరలు పెరగకపోవడం కొంత ఉపశమనం.
సమస్యలపై పోరాటం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో విత్తన, ఎరువుల కొ రత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రాబోయే 3 నెలల పాటు సమస్యలపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విద్యా, వైద్యం, పింఛన్లు, అటవీ భూములు తదితర సమస్యలపై సర్వే చేసి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎరువుల యాప్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.
మాలల హక్కుల
సాధనకు కృషి
వెల్దుర్తి(తూప్రాన్): జాతీయ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని అందుగులపల్లికి చెందిన ప్రభాకర్‌ను నియమించారు. ఈమేరకు ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవ్, ఉపాధ్యక్షుడు ఆనంద్, యూత్ అధ్యక్షుడు నరేశ్ నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. మాలల హక్కుల సాధన కోసం తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.


