మెదక్‌జోన్: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా జనగణన
కౌడిపల్లి(నర్సాపూర్): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్లు మహిపాల్, రామకృష్ణ, తహసీల్దార్ కృష్ణ, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.
సర్కారు బడిలో
సకల వసతులు
హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్‌పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్, శశికుమార్, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన
వైద్య సేవలు
చిన్నశంకరంపేట(మెదక్): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ యాదగిరిరావు, ఎంఎల్‌హెచ్‌పీ కుమారి, సూపర్‌వైజర్ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు.


