కౌడిపల్లి(నర్సాపూర్): నిర్లక్ష్యం వల్లే వందశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండలంలోని రాయిలాపూర్‌లో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 350 మంది చనిపోయారని తెలిపారు. వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. జీరో యాక్సిడెంట్, జీరో డెత్‌గా జిల్లాను మారుద్దామని పిలుపునిచ్చారు. ప్రమాదం జరిగిన గంటలోపు గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ‘రా వీర్’ (రహదారి వీరుడు)గా గుర్తించి ప్రభుత్వం రూ. 25 వేల నజరానా ఇస్తుందన్నారు. మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ తరఫున హెల్మెట్ ధరిస్తాం.. జాగ్రత్తలు పాటిస్తామని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సర్పంచ్ స్వప్న, సీఐ జాన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, మాజీ సర్పంచ్ శేఖులు, ఉపసర్పంచ్ సంతోష్‌కుమార్, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


