అక్రమార్కులు తరలించగా
మిగిలిన మట్టి కుప్పలు
అర్ధరాత్రి
గుట్టుగా తరలింపు
నర్సాపూర్ రూరల్: అక్రమార్కులకు మట్టే ఆహారంగా మారింది. అర్ధరాత్రి గుట్టుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని రెడ్డిపల్లి శివారులో కాళేశ్వరం 18వ ప్యాకేజీ కాలువ వెళ్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర టన్నెల్ (సొరంగం) పనులు ప్రారంభించి సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. కాగా కాంట్రాక్టర్ టన్నెల్ కోసం తీసిన మట్టి గుట్టలుగా పేరుకుపోయింది. పనులు నిలిచిపోయి నెలలు గడవడంతో అక్రమార్కుల కన్ను మట్టి కుప్పలపై పడింది. పెద్దఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పాటు సొరంగం నుంచి వెలువడిన రాళ్లను సైతం ఇంటి నిర్మాణాల కోసం తరలిస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కాగా మట్టి కుప్పలు కరిగిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ మట్టి వ్యాపారుల నుంచి అధికారులకు మాముళ్లు ముట్టడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ. కోట్ల విలువ చేసే మట్టిని తరలించిన అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


