మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతవారం ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలపై శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజావాణి అర్జీలు, క్షేత్రస్థాయి పర్యటనలపై సమీక్షించారు. అధికారులందరూ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా పనితీరు మరింత మెరుగుపడే దిశగా పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రజావాణికి వివిధ సమస్యలపై 80 వినతులు వచ్చాయి.
పంట వివరాల నమోదు తప్పనిసరి
కొల్చారం(నర్సాపూర్)/తూప్రాన్: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, 10వ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ వ్యవసాయాధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని అప్పాజిపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట నమోదు వివరాలను మొబైల్ యాప్ ద్వారా పక్కాగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటివరకు 39,827 ఎకరాలు నమోదు చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు యూరియా విక్రయించే వారి లైసెన్స్ రద్దు చేయాలని, రైతులకు అందుబాటులో ఉండని అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఓ శ్వేతా కుమారి, సర్పంచ్ వెంకట్‌గౌడ్, ఏఈఓలు ఉన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో పర్యటించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్
క్షేత్రస్థాయిలో పర్యటించాలని
అధికారులకు సూచన


