జిల్లాలో భానుడి భగభగ
● ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి
● బయటికి వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు
జిల్లాలో మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లాలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం వేళ పనుల మీద బయటికెళ్లిన వారు ఎండ వేడిమికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపశమనం పొందడానికి ఫ్యాన్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాతో పాటు పలు మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇప్పుడే ఎండలు ఈవిధంగా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు
ఎండకు జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాలు, రోడ్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులపై బయటికి వెళ్తున్న వారు మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు, పండ్ల రసాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలో మార్చి మొదటి వారంలోనే 38 డిగ్రీల ఉప్ణోగ్రత దాటింది. వచ్చే ఏప్రిల్, మే నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ఇలా..
తేదీ ఉష్ణోగ్రత
4 35 డిగ్రీలు
5 36.5
6 36.8
7 38.6
8 37.9
9 38.3
నాలుగైదు రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణ్రోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, రాత్రివేళ మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజూమున చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏటా ఉగాది వరకు ఇదే వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత ఎండల తీవ్రత మరింతగా పెరిగి పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. తలపై గొడుకు, చేతి రుమాలు, టోపీ ధరించాలి. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాయనాలు, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా వయో వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగు జాగ్రతలు పాటించాలి.
– సునీతా, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్


