బోనస్‌ బొనాంజా | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ బొనాంజా

Oct 18 2025 9:53 AM | Updated on Oct 18 2025 9:53 AM

బోనస్‌ బొనాంజా

బోనస్‌ బొనాంజా

సన్నాలకు సర్కార్‌ బోనస్‌ బొనాంజా ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేసిన 48 గంటల్లోనే కనీస మద్దతు ధరతో కలిపి బోనస్‌ కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈసారి దొడ్డు వడ్లకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,389కి పెరిగింది. ఈ లెక్కన బోనస్‌తో కలిపి సన్న వడ్లకు రూ.2,889 చెల్లించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే గత యాసంగి బోనస్‌ బకాయిలూ కూడా చెల్లించాలని రైతన్నలు డిమాండ్‌ చేస్తున్నారు.

– మెదక్‌ అర్బన్‌

వానాకాలం సీజన్‌ సన్నాలకు అనుకూలం కావడం.. బోనస్‌ ధరపై ఆశతో రైతులు 1,00,464 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు. ముఖ్యంగా మంజీరా తీర ప్రాంతాలు, బోరు ఆధారిత వ్యవసాయం చేసే పాపన్నపేట, కొల్చారం, మెదక్‌ , హవేలిఘనపూర్‌, నర్సాపూర్‌, కౌడిపల్లి, రామాయంపేట, నిజాంేపేట, తూప్రాన్‌ తదితర మండలాలలో సన్న రకం వరి సాగు చేశారు. గతంలో దొడ్డు ధాన్యం మద్దతు ధర రూ.2,320 ఉండగా, ఈసారి రూ.2,389కి పెంచారు. ఈ లెక్కన చూస్తే సన్నాలకు బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,889 వస్తుంది. సాగు పరంగా పెట్టుబడి చూస్తే.. సన్న వడ్లకు ఎకరాకు రూ.25 వేలు, దొడ్డు రకం వడ్లకు రూ.20 వేలు అవుతుంది. అలాగే దిగుబడిని బేరీజు వేస్తే సన్నాలు 22 క్వింటాళ్లు, దొడ్డువి 25 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. బోనస్‌పై ఆశతో కొంత మంది సన్న వడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు.

యాసంగి బోనస్‌ ఏదీ?

గత యాసంగి బోనస్‌ కు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయక పోవడంతో అన్నదాతలో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఈ యేడు బోనస్‌ మద్దతు ధరతో కలిపి 24 గంటల్లోనే చెల్లిస్తామని ప్రకటించినా, బోనస్‌ బకాయీల ఊసే లేక పోవడంతో ఆందోళన వ్యక్త మవుతోంది. గత యాసంగిలో 14,994 మంది రైతులు 62,747 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని విక్రయించారు. వీరికి బోనస్‌ రూపంలో రూ.31.37 కోట్లు రావాల్సి ఉంది. వీటి కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నారు.

సన్నాలు కొనుగోళ్లు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు

జిల్లాలో వానాకాలం సాగు

లక్షా 464 ఎకరాలు

దొడ్డురకం వడ్లకు మద్దతు ధర

రూ.2,389కి పెంపు

సన్నాలకు బోనస్‌తో కలిపి రూ.2,889

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement