
బీసీ రిజర్వేషన్లకే అడ్డంకులెందుకు?
● నేటి బంద్‌ను విజయవంతం చేద్దాం
● బీసీ సంఘం నేత సురేందర్‌గౌడ్
మెదక్‌జోన్: ఎకనామికల్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు లేని అడ్డంకులు బీసీ రిజర్వేషన్లకే ఎందుకు అని బీసీ నేత కొండన్ సురేందర్‌గౌడ్ ప్రశ్నించారు. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే డిమాండ్‌తో తలపెట్టిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్‌లో వివిధ బీసీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా ఏళ్లతరబడి అన్యాయానికి గురవుతున్న బీసీలందరూ పోరాటం సాగించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్దమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చింతల నర్సింహులు, శంకర్ గౌడ్, మామిళ్ల అంజనేయులు, రామస్వామి, కృష్ణ, మంగ మోహన్ గౌడ్, ఎండీ హఫీజ్, గౌస్ ఖురేషి, మానవ హక్కుల వేదిక నేత షేక్ అహ్మద్ పాల్గొన్నారు.