
దళారులను నమ్మి మోసపోవద్దు
టేక్మాల్(మెదక్): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శనివారం మండలంలోని బర్దిపూర్‌లో పత్తి పంటను పరిశీలించారు. వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆయనకు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పాపన్నపేట సిద్ధార్థ జిన్నింగ్ మిల్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు లోకల్ కమిటీలను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు రైతులు మద్దతు ధర పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, రైతులు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్