
లెక్క ఎంచక్కా..
భూ కొలతలు పక్కా..
నెల రోజుల నిరీక్షణకు తెర..
జిల్లాకు లైసెన్స్‌డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు
● మొదటి విడతలో 106 మందికి శిక్షణ.. 77 మంది అర్హత
● రెండో విడతలో 78 మందికి ట్రైనింగ్
● నేడు సీఎం చేతుల మీదుగా లైసెన్స్‌లు
మెదక్ అర్బన్: ఆధునిక పరికరాలతో సర్వే చేసి.. భూ కొలతలను పక్కాగా నిర్ధారించడానికి లైసెన్స్‌డ్ సర్వేయర్లు రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలో శిక్షణ పొంది అర్హత సాధించిన 77 మంది సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లైసెన్స్‌లు అందజేయనున్నారు. అనంతరం జిల్లా అధికారులు మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించనున్నారు.
తీరనున్న ఇబ్బందులు
ప్రజలకు సులభంగా భూ సేవలు అందించేందుకు ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా, కేవలం 10 మంది రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. దీంతో అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరగా, మొదటి విడతలో 106 మంది ఎంపికయ్యారు. వీరికి 50 రోజుల శిక్షణ అనంతరం పరీక్ష పెట్టారు. అందులో అర్హత సాధించిన వారికి సీనియర్ సర్వేయర్ వద్ద 40 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత పొందితే, వారికి సర్వేయర్ లెసెన్స్ ఇస్తారు. ఈ క్రమంలో జిల్లాలో మొదటి విడతలో 106 మందిని ఎంపిక చేసి మే 26 నుంచి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి 77 మంది చివరి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరికి సీఎం చేతుల మీదుగా లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. అనంతరం మండలానికి నలుగురు నుంచి ఆరుగురిని లైసెన్స్‌డ్ సర్వేయర్లనుగా నియమించనున్నారు. కాగా ఆగస్టు 18 నుంచి రెండో విడత శిక్షణ ప్రారంభం కాగా, జిల్లాలో 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 78 మంది మాత్రమే శిక్షణకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎంపికై న సర్వేయర్లకు ప్రభుత్వం అధునాతన డీజీపీఎస్ మిషన్లు ఇవ్వనున్నారు. వీటితో ఖచ్చితమైన కొలతలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే తమకు జీతాల విషయంలో స్పష్టత లేదని, ప్రభుత్వం తరఫున నెల నెలా జీతాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా ఉత్తీర్ణులైన వారు నెల రోజులుగా మండలాల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ఇచ్చారు.. పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకపోవడంతో కొంత నిరాశ చెందారు. నెల రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న రెండో బ్యాచ్‌కు వివిధ పరీక్షలను నిర్వహించిన తర్వాత లైసెన్స్‌లను జారీ చేయనున్నారు.

లెక్క ఎంచక్కా..