
వన దుర్గమ్మ దర్శనాలు ప్రారంభం
62 రోజుల అనంతరం ఆలయ ప్రవేశం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం ఎట్టకేలకు 62 రోజుల అనంతరం శుక్రవారం ప్రారంభమైంది. రెండు నెలలుగా, ఆగస్టు 14 నుంచి మంజీరా నదికి వరదలు రావడంతో దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. మధ్యలో రెండు రోజుల దర్శనం ప్రారంభించినప్పటికీ, తిరిగి వరదలు రావడంతో ఆలయాన్ని మూసి వేశారు. ఫలితంగా ఆలయానికి సుమారు రూ.1.50 కోట్ల నష్టం జరిగింది. ఇటీవల సింగూరు నుంచి వరద తగ్గడంతో ఆలయాన్ని శుభ్రం చేసి, భక్తుల దర్శనానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. అర్చకులు దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు.
బీసీలకు 42శాతం
రిజర్వేషన్ కల్పించాల్సిందే
సీపీఎం డిమాండ్
మెదక్ కలెక్టరేట్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీసు వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేశం విలేకరులతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ వ్యవహారంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రాష్ట్ర బంద్ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, నాయకులు కిరణ్, అజయ్, సత్యం, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
మత్తుకు బానిస కావొద్దు
న్యాయమూర్తి శుభావల్లి
మెదక్‌జోన్: ఎట్టిపరిస్థితుల్లో మత్తుకు బానిస కావద్దని మెదక్ జిల్లా సీనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం శుభావల్లి సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, మత్తుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ తీసుకునే వారి మానసిక స్థితి గురించి విద్యార్థులకు వివరించారు. ప్రాథమిక హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్యపానం వలన కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ డ్రగ్స్ నిర్మూలన కమిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమణ కుమార్, ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ జే.వెంకటేశ్వర్లు, లీగల్ అడ్వైజర్ ఎల్.సిద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అతిథి అధ్యాపక పోస్టులకు
దరఖాస్తులు
మెదక్ కలెక్టరేట్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో రసాయన శాస్త్రం(1), కంప్యూటర్ సైన్‌న్స్ అప్లికేషన్‌న్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50శాతం మార్కులుంటే అర్హులని తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణులైన వారికి, అలాగే బోధనా అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు ఈనెల 22న సాయంత్రం 4గంటలలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 23న కళాశాల ప్రాంగణంలో డెమో క్లాస్‌తోపాటు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.
పంట వివరాలు
నమోదు చేసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని రైతులు తమ పంటల వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని శివాయిపల్లి గ్రామంలో రైతులకు కాటన్ కపాస్ యాప్‌పై అవగాహన కల్పించారు. రైతులు తమ పత్తి పంటను అమ్ముకోవాలంటే ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అమ్ముకునే అవకాశం ఉందన్నారు.

వన దుర్గమ్మ దర్శనాలు ప్రారంభం