
ప్రభుత్వాల వైఖరి మారాలి
మెదక్ కలెక్టరేట్: కార్మికులు, ఉద్యోగుల రంగాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మార్చుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్‌లోని టీఎన్జీఓ భవన్‌లో జిల్లా సెమినార్ నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు – ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా ఉద్యోగులు, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలబడిన బ్యాంకింగ్, ఇన్సూరెన్‌న్స్ రంగాలలోకి విదేశీ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. పోస్టల్, టెలికంలోనూ ఇదే స్థితిలో కొనసాగుతుందని చెప్పారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై సీఐటీయూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ, సంతోష్, జిల్లా కోశాధికారి నర్సమ్మ, అడివయ్య, మల్లేశం, అజయ్, యాదగిరి, దుర్గ, కవిత, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.
కార్మికులు, ఉద్యోగుల రంగంపై
విధానాలు మార్చుకోవాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య