
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. మొత్తం 58 అర్జీలు అందజేయగా, ఇందులో భూ సమస్యలు 24, పెన్షన్లు 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 6, ఇతర సమస్యలపై 18 వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అభ్యర్థనలు గౌరవిస్తూ, పారదర్శకత, సమయపాలనతో సేవలందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ట్రైనీ డీఆర్‌ఓ అహ్మద్, ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా మార్కెట్ విలువకనుగుణంగా ట్రిపుల్‌ఆర్ పరిహారం ఇవ్వాలని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పాత జీఓ ప్రకారమే వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే రోజువారీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
ఇసుక కొరత లేకుండా చూడండి
నర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సాపూర్ ఇసుక బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాలకు సంబంధించిన పలు రికార్డులను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, నల్గొండ నుంచి తీసుకురావడానికి అయ్యే రవాణా చార్జీలను లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి నుంచి టోకెన్ తీసుకొని వస్తే ఇసుక అందచేస్తారని వివరించారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. జిల్లాలో తొమ్మిది వేల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారు.