
498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● కలెక్టర్ రాహుల్‌రాజ్
● అవినీతికి పాల్పడితే కేసులే..
రామాయంపేట(మెదక్): ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడితే కేసులు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. మండలంలోని కోనాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 430 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. పది కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారని, దీపావళి అనంతరం కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని, తూకం యంత్రాలతోపాటు తేమ శాతాన్ని కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్ తదితరులున్నారు.
విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు
మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను బకాయిల కోసం గది బయటకు పంపితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగటం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్‌రూంను కలెక్టర్ ప్రారంభించారు.