
రూ.8 కోట్లతో పర్యాటక సొబగులు
● దంతేపల్లి శివారులో 80 ఎకరాలలో ఏర్పాటు
● జిల్లా అటవీ అధికారి జోజి
● పర్యాటక ప్రదేశం సందర్శన
రామాయంపేట(మెదక్): రామాయంపేట అటవీశాఖ రేంజ్ పరిధిలో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మండలంలోని దంతేపల్లి శివారులో 80 ఎకరాల అటవీప్రాంతాన్ని గుర్తించారు. రూ.8 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటు కానుంది. పర్యాటకులు రాత్రివేళ బస చేయడానికి వీలుగా గుడారాలు, గుట్టల చుట్టూ రహదారి సదుపాయం, లోపలిభాగంలో తిరుగడానికి వీలుగా సఫారి వాహనం, ఇతర వసతులు సమకూరనున్నాయి. మట్టిరోడ్డు వెంట పర్యాటకులు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, బల్లలు, తాగునీటి సదుపాయం, మూత్రశాలలతో నిర్మించనున్నారు. కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం, రెండు వాచ్ టవర్లు ఏర్పాటు, సోలార్ బోర్‌వెల్, వాటర్ ట్యాంక్, రహదారికి రెండువైపులా ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతున్న అంతర్ జిల్లా రహదారిని ఆనుకునే పది కిలోమీటర్ల మేర వైశాల్యంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనితో పర్యాటకులకు వణ్యప్రాణులతోపాటు జలపాతాలు, అటవీ సొబగులు, గుట్టలు, కుంటలు వీక్షించే అవకాశం కలుగుతుంది.
ఈకో నిధులతో..
వణ్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలో ఈకో నిధులతో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. దంతేపల్లి అటవీప్రాంతం పరిధిలో ఇందుకోసం ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పర్యాటకుల కోసం దంతేపల్లి శివారులోని కాకుల గండి, లొంక ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి జోజి, ఇతర అధికారులు అటవీప్రాంతాన్ని సందర్శించారు.