జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి 423 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా, కొనుగోలు కేంద్రాలకు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు.
–మెదక్ అర్బన్
మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి కురిసిన వర్షాలు.. పోటెత్తిన వరదల్లో పంటలు మునిగి తేలాయి. దిన దిన గండంగా ఎవుసం చేసిన అన్నదాత ఎట్టకేలకు గట్టెక్కాడు. కొన్ని చోట్ల ఇంకా పంటలు చేతికి రాలేదు. జిల్లాలో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 3.30 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లుల్లో దించుకుంటామని, మరో 60 వేల మెట్రిక్ టన్నులు సమీప జిల్లాలకు పంపించే అవకాశం ఉందని డీఎం జగదీశ్వర్ తెలిపారు. కాగా గత ఖరీఫ్‌కు సంబంధించి 90 శాతం, యాసంగికి సంబంధించి 50 శాతం సీఎంఆర్ పూర్తి చేశారు. ప్రస్తుతం మొత్తం 493 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ 176, పీఏసీఎస్ 317 కేంద్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. కాగా ఈసారి 38 పారా, 47 రా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించనున్నారు. ఎంపిక చేసిన మిల్లులు బ్యాంక్ గ్యారంటీ విధిగా ఇవ్వాల్సి ఉంటుంది.
కోతలు ప్రారంభం
కొల్చారం, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. కాగా కొల్చారం మండలంలోని వరిగొంతం, అప్పాజిపల్లి, అంసాన్‌పల్లి, పోతంశెట్టిపల్లి, కొంగోడ్, నాయిని జలాల్‌పూర్ , వెంకటాపూర్, కొల్చారం గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పాపన్నపేట మండలంలోని చీకోడ్, లింగాయపల్లి, లక్ష్మీనగర్‌లో వరి కోతలు కోస్తున్నారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్, వెంకటాపూర్, ప్రగతి ధర్మారం, నిజాంపేట మండలం నస్కల్, నందిగామ, కల్వకుంట తదితర గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం 50 లక్షలు నిల్వ ఉన్నాయి. మిగతావి త్వరలో వస్తాయి. 13 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 7 వేలు అవసరం అవుతాయి. అవసరమైనన్నీ మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి కొత్తగా 100 ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్‌లను ఉపయోగిస్తాం.
– జగదీశ్ కుమార్, డీఎం, సివిల్ సప్లయిస్
3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
426 కొనుగోలు కేంద్రాలుప్రారంభం
7 వేల టార్పాలిన్లు.. 50 లక్షల గన్నీ బ్యాగులు
అందుబాటులో గోదాంలు
కొనుగోలు కోలాహలం