
తడి లేదు.. పొడి లేదు
● అలంకారప్రాయంగా షెడ్లు
● రూ. 40 లక్షల నిధులు వృథా
● నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ అపహాస్యమవుతోంది. పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసిన డంప్‌యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేయడానికి, వాటిని రిసైక్లింగ్ చేయడానికి గాను రూ. 40 లక్షల నిధులతో నిర్మి ంచిన రెండు షెడ్లు నిరుపయోగంగా మారాయి. వీటి కోసం ఖర్చు చేసిన 40 లక్షల నిధులు వృథాగా మారాయి.
ఆరు బయటే చెత్త పారబోత
పట్టణంలో ప్రతి రోజూ ట్రాక్టర్లు, ఆటోల్లో 12 వార్డుల నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వేర్వేరుగా చెత్తను ఇవ్వడానికి గాను పట్టణంలోని అన్ని గృహాలకు బుట్టలు సరఫరా చేశారు. అయినా వేర్వేరుగా ఇవ్వకుండా ఒకే చోట ఇస్తున్నారు. డంపింగ్‌యార్డులో తడి చెత్త, కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వస్తువులను సెగ్రిగేషన్ షెడ్డులో వేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్, బాటిళ్లు, ఇతర వస్తువులను డీఆర్‌సీసీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్)కు తరలించి వేరు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు షెడ్లను వేర్వేరుగా నిర్మించారు. తయారు చేసిన సేంద్రియ ఎరువును మున్సిపాలిటీ పరిధిలో మొక్కలకు, నర్సరీల్లో వినియోగించి మిగితాది విక్రయిస్తారు. డీఆర్‌సీసీలో వేర్వేరు చేసిన చెత్త, ఇతర సామగ్రిని స్వచ్ఛంద సంస్థకు విక్రయించి చెత్త నుంచి సంపద సృష్టించాలి. దీంతో మున్సిపాలిటీకి ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు చెత్త రహిత పట్టణంగా రూపొందుతుంది. కాగా పట్టణం మున్సిపాలిటీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించలేదు. ట్రాక్టర్లు, ఆటోల్లో తరలిస్తున్న తడి, పొడి చెత్తతో పాటు ఇతర సామగ్రిని షెడ్లలో వేయకుండా ఆరు బయటనే వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఈప్రాంతంలో పంటలు చేస్తున్న రైతులు దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు, డీఆర్‌సీసీ సెంటర్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కడం లేదు.