
లక్ష్యం.. నిర్లక్ష్యం
పచ్చదనం పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం జిల్లాలో మందకొడిగా సాగుతోంది. కొన్నిశాఖల నిర్లక్ష్యంతో లక్ష్యం నెరవేరడం లేదు. పథకం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇక జిల్లా పోలీస్‌శాఖ ఈ పథకాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్
జూలై 17న కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి వివేక్ మొక్కలు నాటి వన మహోత్సవం పథకాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 37 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించారు. జిల్లాలోని 21 మండలాలు, 492 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడే నర్సరీలు ఉన్నాయి. వీటిని డీఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారు. అలాగే అటవీశాఖ ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసింది. వీటితో పాటు జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే శాశ్వత నర్సరీలు ఉన్నాయి. వీటిలో నీడనిచ్చే వాటితో పాటు పండ్లు, పూలనిచ్చే 30 రకాల మొక్కలు పెంచుతున్నారు.
ఆసక్తి చూపని మున్సిపాలిటీలు
జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవంలో శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలు లక్ష్యానికి దాదాపు దగ్గర ఉన్నాయి. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం పథకం ముందుకు సాగడం లేదు. 4 మున్సిపాలిటీలకు 2.60 లక్షలు లక్ష్యంగా కేటాయించగా, ఇప్పటివరకు 1,87,520 నాటడం పూర్తయ్యింది. మరో 72,480 లక్షలు పూర్తిచేయాల్సి ఉంది. అలాగే అగ్రికల్చర్ శాఖకు 30 వేలు కేటాయించగా 1,373 మాత్రమే నాటగా, పోలీస్‌శాఖకు 18 వేలు కేటాయించగా, ఒక్క మొక్క కూడా నాటకపోవడం గమనార్హం.
ముందుకు సాగనివన మహోత్సవం
పట్టించుకోని పోలీస్‌శాఖ
అగ్రికల్చర్ అంతంతే..
87 శాతం పూర్తి
జిల్లాలో వన మహోత్సవం 87 శాతం పూర్తయ్యింది. కొన్ని శాఖలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వన మహోత్సవం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అందువల్లే లక్ష్యం పూర్తి కావడం లేదు. – జోజీ, డీఎఫ్‌ఓ