
రెవెన్యూ చట్టాలపై అవగాహన: ఆర్డీఓ
తూప్రాన్: రెవెన్యూ పాలన, భూ చట్టాలపై డివిజన్ పరిధిలో నూతనంగా నియమితులైన గ్రామపాలన అధికారులకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వివిధ భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామపాలన విధానాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా భూభారతి చట్టం గురించి వివరించి, గ్రామస్థాయిలో భూముల రికార్డుల డిజిటల్ నిర్వహణ, ప్రజలకు సులభంగా భూమి వివరాలు అందుబాటులో ఉంచడం, భూములపై అనధికార ఆక్రమణలు నివారించడం వంటి అంశాల గురించి వివరించారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించి చట్టపరమైన విధానాలు, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ పుస్తకం తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం హవేళిఘణాపూర్ డైట్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా విద్యార్థుల్లో కోడింగ్ డేటా సైన్స్, ఏఐ అంశాలలో నైపుణ్యం పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్, నాగరాజు, రవికాంత్‌త్, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని అవుట్‌డోర్ స్టేడియంలో ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్– 14, అండర్– 17 బాలుర పోటీల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్‌చార్జి యువజన క్రీడలశాఖ అధికారి, డీఈఓ రాధాకిషన్ హాజరై ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. అండర్–17లో 36 మంది అండర్–14లో 22 మంది మొత్తం 58 మంది ఉమ్మడి జిల్లా జట్టును రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీడీలు శ్రీధర్‌రెడ్డి, మాధవరెడ్డి, మధుసూదన్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి
దుబ్బాక: స్థానిక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్‌లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కి,మీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే 10 బస్‌లతో మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్‌లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎం ను నియమించి 60 బస్‌లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు.

రెవెన్యూ చట్టాలపై అవగాహన: ఆర్డీఓ

రెవెన్యూ చట్టాలపై అవగాహన: ఆర్డీఓ