
ఎవరి చేతికో పగ్గాలు!
● నామినేషన్ వేసిన ఆంజనేయులుగౌడ్, రాజిరెడ్డి, రాంచందర్‌గౌడ్
● అందరి అభిప్రాయాలతో నివేదిక
సా్థనిక సంస్థల ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీని గ్రామీణస్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రజామోద యోగ్యమైన నాయకుడికి డీసీసీ పదవి కట్టబెట్టాలని, ఏకంగా ఏఐసీసీ నాయకులే రంగంలోకి దిగారు. సామాన్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నామినేషన్లనే కాకుండా, పార్టీకోసం కష్టపడిన, సేవాభావం గల నాయకుల వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సమావేశానికి రాలేకపోయిన వారు ఫోన్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని సూచించినట్లు సమాచారం. నాయకత్వ ఒత్తిడి, పరపతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నాయకులు, ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగానే ఉన్నట్లు కనపడుతుంది. రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, చెరో అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీవర్గాలు గుసగుసలాడుతున్నాయి. చివరికి ఎవరు జిల్లా కాంగ్రెస్ బాద్‌షా అవుతారో వేచి చూడాల్సిందే.
డీసీసీ అధ్యక్షుడిని నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. డీసీసీ పదవికి ముగ్గురు నామినేషన్లు వేసినా, ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – మెదక్ అర్బన్
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వర్‌రావు, నాసిర్ అహ్మద్, వరలక్ష్మిని నియమించారు. ఆదివారం మెదక్, రామాయంపేట బ్లాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. మెదక్ నియోజకవర్గంలోని రెండు బ్లాకుల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఒక అభ్యర్థి పేరును ప్రతిపాదించగా, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన అమాత్యుల నిర్ణయమే తమ అభిప్రాయంగా భావించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే మెదక్ ప్రాంతానికి చెందిన నాయకులు కలిసికట్టుగా పరిశీలకుల ముందుకు వెళ్లి, తమ అభిప్రాయాన్ని ఏకకంఠంతో తెలిపినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి మాత్రం తాను నామమాత్రంగా పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ఏఐసీసీ పరిశీలకులు అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. సోమవారం నర్సాపూర్, కౌడిపల్లిలో జరిగిన సమావేశానికి నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, మాసాయిపేట మండలాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు మద్ధతు లభించినట్లు తెలుస్తోంది.