
కార్డులు సరే.. షాపులేవీ?
ప్రభుత్వం నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దుకాణాలు కూడా పెంచాలని కోరుతున్నారు. కొన్నిచోట్ల పరిమితికి మించి కార్డుదారులు ఉండటం, మరికొన్ని చోట్ల బియ్యం తెచ్చుకోవడానికి దూర భారంతో నెల నెలా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
– పెద్దశంకరంపేట(మెదక్)
జిల్లావ్యాప్తంగా 2,16,614 ఆహారభద్రత కార్డులు ఉండగా, ఇటీవల కొత్తగా మరో 9,964 కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 469 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటివరకు 520 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు. పలు మండలాల పరిధిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదాంలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో 11 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఆహారభద్రత కార్డులను ప్రభుత్వం అందజేస్తుండగా, వీరికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు రేషన్ దుకాణాల్లో సహాయకులు లేకుండానే డీలర్లు బియ్యం అందజేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు రేషన్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డులకు అనుగుణంగా మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దుకాణాల సంఖ్య పెరిగితే ప్రజలకు ఇబ్బందులు దూరం కావడంతో పాటు సమయం సైతం ఆదా అవుతుంది.
కొత్త జీపీల్లో తప్పని తిప్పలు
జిల్లాలో నూతన పంచాయతీలను ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. కానీ ఆయా గ్రామాల్లో నూతన రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయలేదు. పలు తండాలను పంచాయతీలుగా మార్చింది. కానీ అక్కడ సైతం నూతన షాపులకు మోక్షం కలగలేదు. దీంతో ప్రజలు కిలోమీటర్లు ప్రయాణించి రేషన్ దుకాణాల నుంచి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నూతన రేషన్ కార్డులతో పాటు ప్రతీ పంచాయతీ పరిధిలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆదేశాలు రావాల్సి ఉంది
ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 11 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఈ విషయం నివేదించాం. ఆర్డీఓ, ఇతరశాఖల అధికారుల సహకారంతో నూ తన రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– నిత్యానందం,
జిల్లా పౌరసరఫరాల అధికారి
జిల్లా వివరాలు
గ్రామ పంచాయతీలు 469
రేషన్ దుకాణాలు 520
ఆహారభద్రత కార్డులు 2,16,614
కొత్తగా మంజూరైనవి 9,964
అంత్యోదయ 13,909
అన్నపూర్ణ 75
జిల్లాలో వేధిస్తున్న రేషన్ షాపుల కొరత
కొత్త పంచాయతీల్లో ఏర్పాటుకు కలగని మోక్షం
దూరభారంతో నెల నెలా అవస్థలు
కొత్తగా 9,964 కార్డులు మంజూరు