
బల్దియా బరి.. నేతల గురి
రామాయంపేట(మెదక్): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయా పార్టీల్లో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ, తమ వార్డుల్లో పట్టు సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఫలానా వార్డు నుంచి తాము పోటీలో ఉంటామని నాయకులు తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాగైనా బల్దియాల్లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. బీఆర్‌ఎస్ సైతం పట్టు నిలుపుకోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, తూప్రాన్‌లో 16, నర్సాపూర్ 15, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతో మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు జరిపేందుకు ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత జనవరిలో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా, ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పాలకవర్గం ఉన్నప్పుడు, వార్డుల్లో నెలకొన్న సమస్యలు ఎంతో కొంత పరిష్కారమయ్యేవి. ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఏ పని సరిగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి.