
చినుకు పడితే.. వణుకే!
రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణ ంలో మోస్తారు వర్షం కురిసిందంటే చాలు ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. ఏకంగా అక్కల బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశిస్తుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో గతంలో ఎప్పుడో నిర్మించిన రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై యథేచ్ఛగా వదర నీరు రోడ్డుపై పారుతుంది. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు భయం, భయంగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రధాన రహదారి జలమయం
ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట ప్రధాన రహదారిపై పెద్దఎత్తున వరద నీరు ప్రవహించింది. రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై కింద పడిన సంఘటనలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించినా, మళ్లీ వర్షం కురవడంతో రోడ్డుపై ఇసుక చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నిలిచి ప్రయాణాలకు ఆటంకంగా మారుతుంది. డివైడర్ నిర్మించిన అధికారులు రోడ్డు మరమ్మతుల విషయమై పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అలాగే మోస్తారు వర్షం కురిసినా పట్టణంలోని 11వ వార్డు అక్కల బస్తీలో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఏటా తమకు ఈ ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దఎత్తున వరద నీరు ఇళ్లలోకి చేరిందని, ఇళ్లలో ఉన్న దుస్తులు, నిత్యావవసర సరుకులు సైతం తడిసిపోయాయని వాపోయారు.
పేటలో ముంపు ముప్పు తప్పేనా..?
శాశ్వత చర్యలకు పడని ముందడుగు
ఇళ్లలోకి చేరుతున్న వర్షం నీరు
పట్టించుకోని అధికారులు
ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు
చర్యలు చేపడుతున్నాం
వర్షాలు పడితే రహదారులపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాం. ఇటీవల తారు రోడ్డుపై భారీ వర్షం మూలంగా ఇసుక మేట వేయగా, పూర్తిగా తొలగించాం. అక్కల గల్లీలో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాం.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్

చినుకు పడితే.. వణుకే!

చినుకు పడితే.. వణుకే!

చినుకు పడితే.. వణుకే!