
మాకొద్దు.. జీపీఓ!
పాత సర్వీస్ పోతుందని..
గత ప్రభుత్వం రెవెన్యూశాఖ నుంచి 562 మంది వీఆర్‌ఓలను తప్పించి వివిధ శాఖల్లోకి పంపింది. అయితే పని చేసిన సర్వీస్‌ను ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలో కలపాలని అప్పట్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఆందోళన చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఐదేళ్లుగా కోర్టులో కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం మళ్లీ ఈ శాఖను వదిలి గ్రామ పాలనాధికారి (జీపీఓ)గా చేరితే పాత సర్వీస్ పోతుందని, ఇప్పటికే రెవెన్యూలో ఒక్కొక్కరం రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తించామని, ఆ సర్వీస్ పోతే తీరని నష్టం జరుగుతుందని, అందుకే జీపీఓగా రావడానికి ఇష్టపడటం లేదని పలువురు వీఆర్‌ఓలు పేర్కొన్నారు.
● పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏల అనాసక్తి
● రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా స్పందన కరువు
● పరీక్షకు హాజరైంది కేవలం142 మంది మాత్రమే
మెదక్‌జోన్: గ్రామ పాలన అధికారి (జీపీఓ)గా పనిచేసేందుకు పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు అనాసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా వెనుకంజ వేశారు. జీపీఓలుగా చేరితే పాత సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోకపోవటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఫలితంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో 392 రెవెన్యూ గ్రామాలు
జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయతీలు ఉండగా, 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో 562 మంది వీఆర్‌ఓలుగా జిల్లాలో విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను తొలగించి వారిని వివిధ శాఖల్లోకి పంపింది. 2023లో అధికారంలోకి వచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు పూర్వవైభవం తెస్తామని, గ్రామానికో జీపీఓను నియమించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొంది. గతంలో వీఆర్‌ఓలుగా పనిచేసిన వారు తిరిగి రావాలని కోరింది. అందుకోసం రెండుసార్లు రాత పరీక్షలు నిర్వహించింది. అయితే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటిసారి జిల్లావ్యాప్తంగా 104 మంది దరఖాస్తు చేసినా, పరీక్షకు 79 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో ఉత్తీర్ణత సాధించింది 47 మంది మాత్రమే. రెండోసారి జూలై 27న పరీక్ష నిర్వహించగా, 73 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష రాసింది మాత్రం 63 మంది మాత్రమే. ఈ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. గతంలో జిల్లాలో సుమారు 562 మంది వీఆర్‌ఓలుగా విధులు నిర్వర్తించారు. వారు ప్రస్తుతం జీపీఓలుగా రావటానికి ఆసక్తి చూపటం లేదు.