
అవగాహన, అప్రమత్తతే కీలకం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌కు సైబర్ క్రైం, నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి కేసును సీరియస్‌గా తీసుకొని బాధితులకు తక్షణ న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సైబర్ వారియర్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్‌లో సంప్రదిస్తే డబ్బులను తిరిగి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు పూర్తి అవగాహన, అప్రమత్తతతో ఉండాలని సూచించారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ నుంచి వచ్చిన టీషర్ట్స్‌ను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్సీ మహేందర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.