
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
కలెక్టర్ రాహుల్‌రాజ్
వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్)/నర్సాపూర్: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ఆయా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 9,964 కుటుంబాలకు నూతన రేషన్‌కార్డులు అందజేశామని తెలిపారు.మహిళా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌కార్డు ప్రతి కుటుంబానికి అవసరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికమని, దానిని దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా మండలంలో విద్యార్థులకు రవాణా వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. నిబంధనలు పెట్టకుండా అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేటలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో కాటేజీలను పరిశీలించారు. నెలాఖరులోగా పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.