నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తప్పనిసరి

Aug 2 2025 7:16 AM | Updated on Aug 2 2025 7:16 AM

నిబంధ

నిబంధనలు తప్పనిసరి

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, లేకపోతే బిల్లులు రావని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం చౌహాన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. చిలప్‌చెడ్‌లో 54 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 15 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన పలువురికి రెండు విడతల బిల్లులు సైతం వచ్చాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించకపోతే మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించేవారికి సైతం అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

చేగుంట(తూప్రాన్‌): పాలిటెక్నిక్‌లో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని 11 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 135 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. చేగుంట పాలిటెక్నిక్‌లో 9 పోస్టులు ఖాళీగా ఉండగా, టెక్నికల్‌ పోస్టులకు ఎంటెక్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

విద్యారంగ సమస్యలు

పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మెదక్‌లో నిర్వహించిన విద్యార్థి అధ్యయన యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 5 వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా నర్సాపూర్‌లోని పీజీ కళాశాలకు సొంత భవనం, మెదక్‌కు ఇంజనీరింగ్‌, పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తూప్రాన్‌, పెద్దశంకరంపేటలలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు తక్షణమే పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు నవీన్‌, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీఎస్‌లో ఖాళీ సీట్లు

మెదక్‌ కలెక్టరేట్‌: రామంతాపూర్‌, బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు విజయలక్ష్మి, నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ తరగతి ఇంగ్లీష్‌ మీడియంలో ఎస్సీ విద్యార్థులకు ఒక సీటు ఖాళీగా ఉండగా, ఎస్టీ విద్యార్థులకు ఆరు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు కలెక్టరేట్‌లోని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కార్యాలయాల్లో లభిస్తాయని సూచించారు.

నానో యూరియాతో

అధిక దిగుబడి

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు నానో ద్రవరూప ఎరువులు వాడటం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని డీఏఓ దేవ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని తునికి వద్దగా రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్‌ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు నానో ఎరువులను తరలించడం సైతం సులభంగా ఉంటుందని చెప్పారు. అనంతరం కేవీకే హెడ్‌ అండ్‌ సైంటిస్ట్‌ శంభాజీ దత్తాత్రేయ నల్కర్‌ మాట్లాడుతూ పంట మార్పిడి చేయాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజ్‌నారాయణ, కోరామండల్‌ ప్రతినిధి రోషన్‌, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

నిబంధనలు తప్పనిసరి 
1
1/1

నిబంధనలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement