
పాదయాత్రను విజయవంతం చేద్దాం
నర్సాపూర్: పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సంయుక్తంగా చేపడుతున్న పాదయాత్ర శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కాగా జిల్లాలోని అన్ని మండలాల నాయకులతో పాటు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి తన రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు మల్లేశ్, మహేశ్‌రెడ్డి, లలిత, శ్రీనివాస్‌గుప్తా, రిజ్వాన్, అశోక్, వినోద తదితరులు పాల్గొన్నారు.