
చిల్లి గవ్వలేదు.. ఇల్లు కట్టేదెట్టా?
కొల్చారం(నర్సాపూర్): కట్టెల పొరకను నాటి..దాని చుట్టూ దాపుగా చీరలను కట్టుకుని నివాసముంటున్న ఈ ఫొటోలో కన్పిస్తున్న మహిళ పేరు అల్లం లక్ష్మమ్మ. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఈమె పేరులో లక్ష్మి ఉన్నా బతుకులో మాత్రం దుర్భిణీతో వెదికినా లక్ష్మి కానరావడం లేదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ద్వారా మంజూరు పత్రాన్ని అందుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి వివిధ విడతల్లో, మొత్తంగా ఐదు విడతల్లో డబ్బులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొదటి విడతగా పూర్తిస్థాయి బేస్మెంట్ నిర్మించిన తర్వాత రూ.1 లక్ష చెల్లించేలా నిబంధన. అయితే ప్రస్తుతం లక్ష్మమ్మ కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండటం, పనిచేయని పరిస్థితుల్లో చేతుల్లో చిల్లి గవ్వ లేదు. అప్పు పుట్టని పరిస్థితి. పెట్టుబడి లేకుండా ఇంటిని ఎలా నిర్మించాలని ఆవేదన చెందుతుంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఉండేందుకు ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతుంది.