మా బడిలో నోఅడ్మిషన్‌ | - | Sakshi
Sakshi News home page

మా బడిలో నోఅడ్మిషన్‌

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

● అక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్‌ ఘనత ● 135మంది విద్యార్థుల చేరిక ● ‘ప్రైమరీ’లో మొత్తంగా 357 మంది

జన్నారం: జిల్లాలో ఈ పాఠశాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రధానోపాధ్యాయుడి అంకితభావం, విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కారణంగా బడిలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే నో అడ్మిషన్‌ బోర్డు ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండలంలోని పొనకల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధి అక్కపల్లిగూడలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉంది. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లిషు మీడియంలో బోధన సాగుతోంది. మండలంలో 29గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ బడిలో 13 పంచాయతీలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. గత విద్యాసంవత్సరంలో 334 మంది విద్యార్థులు ఉండగా.. ఇందులో గురుకుల సీట్లు సాధించిన వారు, ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులు 108మంది ఇతర పాఠశాలలకు వెళ్లారు. ఈ ఏడాది కొత్తగా చేరిన 135మందితో విద్యార్థుల సంఖ్య 357కు చేరింది. దీంతో గురువారం అడ్మిషన్లు క్లోజ్‌ అంటూ బడి బయట పేపరు అతికించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో అడ్మిషన్లు నిలిపివేసినట్లు ప్రధానోపాధ్యాయుడు జాజల శ్రీనివాస్‌ తెలిపారు.

ఆధునిక సౌకర్యాలు

పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, దాతల సహకారంతో పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రీ–ప్రైమరీ తరగతి గదికి ఏసీ ఏర్పాటు చేయగా, ప్రతీ తరగతి గదిలో టీవీలు అందుబాటులో ఉన్నాయి. దిక్సూచి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఎన్‌ఆర్‌ఐ భూముల రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. డెస్క్‌లు, బెంచీలు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌తోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి.

అదనంగా ఆరుగురు వీవీలు

ప్రస్తుతం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో మరో ఆరుగురు విద్యావాలంటీర్లను నియమించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో రెండు అదనపు తరగతి గదుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ గత ఏప్రిల్‌లో రూ.25 లక్షలు మంజూరు చేశారు. గదుల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement