మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో ఏటా వర్షాకాలంలో వన మహోత్సవంలో భాగంగా నాటుతున్న మొక్కల సంరక్షణ కరువవుతోంది. ఫలితంగా మొక్కలు ఎండిపోయి రికార్డుల్లో మాత్రమే సంఖ్య కనిపిస్తోంది. లక్షలాది మొక్కలు నాటినట్లుగా రికార్డుల్లో నమోదవుతున్నా వాస్తవంగా అవేవీ కనిపించని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసిన వెంటనే ఎంతో ఉత్సాహంగా పాలకవర్గాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటేందుకు, ఇళ్లలో పంపిణీకి చూపిస్తున్న ఉత్సాహం సంరక్షణపై చూపించడం లేదు. ప్రతియేటా ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అందుకు తగినట్లుగానే నాటుతున్నట్లుగా లెక్కల్లో చూపిస్తున్నారు.
లక్ష మొక్కలు సంరక్షించినా...
గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బడ్జెట్‌లో 10శాతం తప్పనిసరిగా కేటాయించేలా నిర్ణయించింది. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల వార్షిక బడ్జెట్‌లో 10శాతం పార్కులు, నర్సరీలు, పచ్చదనం అభివృద్ధికి ఖచ్చితంగా కేటాయించి, మిగతా 90శాతాన్ని ఇతర పరిపాలనా అవసరాలకు కేటాయించాలి. గ్రీన్ బడ్జెట్ పేరిట ఏటా పది శాతం నిధులు కేటాయిస్తున్నా అందుకు తగినట్లుగా పచ్చదనం మాత్రం పెంపొందడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నగరంలో 5.96 లక్షలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ణయించగా, 5.52 లక్షల మొక్కలు నాటినట్లుగా లెక్కల్లో చూపించారు. అందులో 3.18లక్షల మొక్కలు ఇళ్లల్లో నాటేందుకు ప్రతీ ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించినా 2.97లక్షలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పంపిణీ చేసిన మొక్కలు ఇళ్లల్లో నాటారా లేదా అని కూడా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. ఇంటింటికీ పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. వీటితోపాటు గతేడాది ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, మున్సిపల్ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటారు. మొక్కలు పెంచి, నాటినందుకు, సంరక్షించే ట్రీగార్డుల కోసం దాదాపుగా రూ.25లక్షల వరకు ఖర్చు చేశారు. నాటిన మొక్కల సంరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో వనమహోత్సవం పేరిట చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం, నిధులు వృథా అవుతున్నాయి. ఏటా కనీసం లక్ష మొక్కలు నాటేలా చూసినా నగరంలో పచ్చదనం పెంపొందుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది 5.63లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్ణయించారు.


