‘భవిత’ భవనం పూర్తయ్యేదెన్నడో..! | - | Sakshi
Sakshi News home page

‘భవిత’ భవనం పూర్తయ్యేదెన్నడో..!

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

● అసంపూర్తిగా యాక్టివిటీ గదులు ● తీరు‘బడి’గా సాగుతున్న పనులు

మంచిర్యాలఅర్బన్‌: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం చేపట్టిన వ్యక్తిగత గదుల నిర్మాణం పనులు(యాక్టివిటీ గదులు) నత్తనడకన సాగుతున్నాయి. భవిత కేంద్రాలకు అదనంగా అవసరమైన కొత్త గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుతోపాటు పాతగదులు, టాయిలెట్లకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు తీరు‘బడి’గా చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఎనిమిది చోట్ల కార్యకలాపాల గదుల నిర్మాణం చేపట్టారు. బడులు పునఃప్రారంభమైనా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో గది రూ.7లక్షల వ్యయంతో చేపట్టగా.. పనులు నేటికీ పూర్తికాలేదు. చాలా చోట్ల తలుపులు, కిటికీలు, గ్రిల్స్‌, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌ పనులు సగంలోనే నిలిచిపోగా బాతూరూమ్‌లు కొలిక్కి రాలేదు. దీంతో భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు అసౌకర్యంగా మారింది.

నిర్మాణం ఇలా..

దివ్యాంగ పిల్లలకు భరోసానిచ్చే భవిత కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.02కోట్ల పరిపాలన అనుమతి మంజూరు చేశారు. కార్యకలాపాల గదుల నిర్మాణం, ర్యాంపులు, రైలింగ్‌తోపాటు మరుగుదొడ్ల నిర్మాణం పిల్లలకు అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం అవసరాలకు అనుగుణంగా, కార్యాచరణ ఆధారిత పెయింటింగ్‌కు నిధులు మంజూరు చేశారు. కార్యకలాపాల గది నిర్మాణానికి యూనిట్‌కు రూ.7లక్షల వరకు, ర్యాంపు, రైలింగ్‌తో కూడిన యాక్సెస్‌ చేయగల టాయిలెట్‌ నిర్మాణం యూనిట్‌కు రూ.లక్ష, భవనాల మరమ్మతులకు రూ.1లక్ష(అవసరం ప్రకారం), ఇప్పటికే ఉన్న టాయిలెట్ల మరమ్మతులకు రూ.50వేలు, పిల్ల ల అభ్యాస, అవసరాలకు అనుగుణంగా పెయింటింగ్‌కు రూ.1.50లక్షలు ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఇందులో జిల్లాలో కార్యకలాపాల గదులు ఎనిమిది మంజూరయ్యాయి. మంచిర్యాల, నెన్నెల మండలం దుబ్బపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, భీమారం, చెన్నూర్‌లో గదుల నిర్మాణానికి రూ.7లక్షల చొప్పున రూ.56లక్షలు కేటాయించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ద్వారా త్వరతగతిన పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణ పపనులపై పర్యవేక్షణ కొరవడడం.. మొదట్లో వేగంగా సాగిన పనులు తర్వాత కాలంలో నెమ్మదించాయి. అధికారులు దృష్టి సారించి గదుల నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement